×
Login

మానవత్వం చాటుకున్న జీఆర్పీ పోలీసులు.. డోలి కట్టి.. అసలేం జరిగిందంటే..?.

0 Comments । By Black Cat News । 3 August, 2023

మానవత్వం చాటుకున్న జీఆర్పీ పోలీసులు.. డోలి కట్టి.. అసలేం జరిగిందంటే..?

రైల్వే పోలీసులు మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ఓ మృతదేహాన్ని కొన్ని కిలోమీటర్ల పాటు మోసుకొచ్చారు.. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేబ్రోలు మండలం వేజెండ్ల రైల్వే స్టేషన్ కి ఒక ఫోన్ కాల్ వచ్చింది.‌ రైల్వే స్టేషన్ కొంచెం దూరంలో ట్రాక్ పై మృతదేహం ఉందని ఫోన్ చేసిన వాళ్ళు చెప్పారు. ఈ విషయాన్ని స్టేషన్ సిబ్బంది జీఆర్పీ పోలీసులు చేరవేశారు. దీంతో జిఆర్పీ ఎస్సై శ్రీనివాసరావు, ఆర్పీఎఫ్ ఎస్సై రమేష్, కానిస్టేబుల్ శ్రీనివాసరావు చేబ్రోలు రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. అక్కడినుంచి మృతదేహం ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. అయితే, మృతదేహం ఆనవాళ్ళు గుర్తించలేని విధంగా ఉంది. అయితే, సంఘటనా స్థలానికి అంబులెన్స్ వెళ్ళలేని పరిస్థితి. చుట్టూ పంట పొలాలు ఉండటం, పైర్లు కూడా వేయడంతో ఎటువంటి వాహనం కూడా అక్కడకు చేరలేని పరిస్థితి ఉంది. దీంతో ముగ్గురు కలిసి ఆలోచించారు. ఎలాగైనా మృతదేహాన్ని అక్కడ నుంచి మార్చురీకి తరలించాలని నిర్ణయించుకున్నారు.

చేబ్రోలు వచ్చి అక్కడ నుంచి గుంటూరు చేరడం కంటే బుడంపాడు వెళితే అక్కడ నుంచి గుంటూరు వెళ్ళడం సులభమని ముగ్గురు నిర్ణయించుకున్నారు. అయితే, బుడంపాడు రెండు కిలో మీటర్ల దూరంలో ఉంది. అక్కడకు మృతదేహాన్ని తీసుకెళ్ళడానికి అవసరమైన డోలిని అక్కడే దొరికిన చిన్న చిన్న వస్తువులతో తయారు చేశారు.

అనంతరం మృతదేహాన్ని అక్కడ రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బుడంపాడు వరకూ డోలిలోనే మోసుకొచ్చారు. అక్కడ నుండి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.

అయితే, చనిపోయినది ఎవరనేది ఇంకా గుర్తించలేదని పోలీసులు తెలిపారు. ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడి చనిపోయి ఉంటారని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు.

ముగ్గురు పోలీస్ సిబ్బంది మానవత్వం చూపి మృతదేహాన్ని తీసుకొచ్చి మార్చురీకి చేర్చటం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ముగ్గురు సిబ్బందిని ఉన్నతాధికారులు ప్రశంసించారు.

CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, East Godavari



#

Also Read

×